అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అని అంటున్న జగన్ కు కాలం కలిసిరావడం లేదు. హైకోర్టులోనే కాదు.. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. అమరావతిని అటకెక్కించి మూడు రాజధానులను పట్టాలెక్కించాలనుకుంటున్న జగన్ కు కోర్టులే ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ అదే జరిగింది. మూడు రాజధానులు కాకుండా అమరావతినే డెవలప్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు ఎక్కింది జగన్ సర్కార్. అయితే స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.హైకోర్టు తీర్పులోనూ కొన్ని అంశాలపైనే సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమరావతిని ఆపేసి మూడు రాజధానులకు వెళదామని ఆశపడ్డ జగన్ సర్కార్ కు ఇది గట్టి షాక్ లాగా మారింది.
తదుపరి విచారణను 31వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇక రైతుల మాత్రం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని.. అమరావతినే అభివృద్ధి చేయాలని డిమాండ్ మొదలుపెట్టారు. కానీ తమ వద్ద డబ్బు లేదని.. అమరావతిని చేపట్టలేమని జగన్ సర్కార్ చెబుతోంది. ఇరువర్గాల వాదనల తర్వాత రాజధానిలో నిర్మాణాపలై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతే తప్పా అమరావతిని పక్కనపెట్టి మూడు రాజధానులకు వెళ్లడానికి మాత్రం అనుమతించలేదు. ఈ పరిణామం జగన్ సర్కార్ కు ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక మింగుడుపడని అంశంగా మారింది.