UPDATES  

 లవ్‌ టుడే మూవీ తెలుగులో ఊహించని విజయం

తమిళం నుంచి డబ్‌ అయిన లవ్‌ టుడే మూవీ తెలుగులో ఊహించని విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. రిలీజైన మొదటి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.6.95 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టడం విశేషం. సినిమా రిలీజ్‌కు ముందు రెండు రాష్ట్రాల్లో కలిసి రూ.2.7 కోట్ల బిజినెస్‌ చేసింది. ఆ లెక్కన రూ.3 కోట్లు బ్రేక్‌ఈవెన్‌గా పెట్టుకున్నారు. కానీ మూడు రోజుల్లోనే ఈ బ్రేక్‌ ఈవెన్‌ దాటి.. లాభాల బాట పట్టింది. మూడు రోజులు కలిపి రూ.3.61 కోట్ల షేర్‌ వచ్చింది. అంటే ఇప్పటికే రూ.61 లక్షల లాభాలు వచ్చాయి. తొలి వీకెండ్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన లవ్‌ టుడే డబ్బింగ్‌ మూవీ అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమా క్లీన్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది ఇలా క్లీన్‌ హిట్‌ అయిన 19వ సినిమా లవ్‌ టుడే. ఈ మూవీని తెలుగులో దిల్‌ రాజు రిలీజ్ చేశాడు. లవ్ టుడే గురించి.. లవ్ టుడే ప్రాపర్ న్యూఏజ్ సినిమా. సోషల్ మీడియా, ఫోన్ లోకంగా బతుకుతున్న నేటితరం యువత జీవనశైలిని ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో చూపించారు. సోషల్ మీడియా ద్వారా మొగ్గతొడిగిన ప్రేమల్లో నిజాయితీ ఉంటుందా?

నమ్మకంతో నిలబడాల్సిన ప్రేమ బంధాలను అనుమానాలతో ఎలా తుంచేసుకుంటున్నారు. నేటితరం ప్రేమపెళ్లిళ్లలో పదింట కేవలం ఒక వంతు మాత్రమే సక్సెస్ కావడానికి కారణమేమిటనే పాయింట్‌ను సమకాలీన అంశాలతో ఆలోచనాత్మకంగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు. కేవలం అవసరం కోసమే ఉపయోగించాల్సిన ఫోన్‌లో తమ జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాల్ని దాచుకుంటున్న యువతరం ఆ రహస్యాలు బయటివారికి తెలియకుండా ఉండటానికి పడే పాట్లను ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించారు. ఫేక్ ఐడీలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల పేరుతో సరదాగా చేసే కొన్ని పనులు ఎదుటివారి జీవితాల్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే సందేశాన్ని ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించారు. సందేశాన్ని సీరియస్‌గా చెబితే ప్రేక్షకులు ఆదరించే రోజులు పోయాయి. ఎంతటి సీరియస్ సబ్జెక్ట్ అయినా షుగర్ కోటెడ్‌లా కామెడీని జోడించి చెప్పడమే ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. లవ్ టుడే అలాంటి సినిమానే. ప్రజెంట్ సొసైటీలోని ఓ సీరియస్ ఇష్యూను ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఎనభై శాతం వరకు కామెడీ, ఓ ఇరవై శాతం మాత్రమే సెంటిమెంట్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. సినిమా ఆద్యంతం సిట్యువేషనల్ కామెడీతో సాగుతుంది. ఎమోషన్స్ కూడా ఫోర్స్‌డ్‌లా కాకుండా రియలిస్టిక్‌గా రాసుకున్న విధానం బాగుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !