UPDATES  

 వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రిం కోర్టు సంచలన తీర్పు…తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రిం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణ బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీలో కొనసాగుతున్న విచారణ తీరు, దర్యాప్తు అధికారులకు బెదిరింపులు, వివేకా కుమార్తె విన్నపం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఇది తెలుగు నాట చర్చనీయాంశమైంది. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా చెప్పుకొచ్చినా.. తరువాత ఇది రాజకీయ కోణంలో హత్య జరిగినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో విచారణను సీబీఐకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ సీబీఐ విచారణ అక్కర్లేదని చెప్పడం.. దీనిపై వివేకా కుమార్తె అభ్యంతరాలు చెప్పడం అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతానికైతే సీబీఐ విచారణ కొనసాగుతున్నా.. దర్యాప్తు మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. విచారణ అధికారులకు బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు, దర్యాప్తులో జాప్యంపై మరోసారి వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ సవ్యంగా సాగాలంటే వేరే రాష్ట్రానికి కేసును బదలాయించాలన్న ఆమె విన్నపం మేరకు.. కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. YS Viveka Murder Case వివేకా హత్య తరువాత సీబీఐ విచారణ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు కడప, పులివెందుల కోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోంది. అయినా విచారణ ఒక కొలిక్కి రాకపోవడం, అప్రూవర్ గా మారిన దస్తగిరికి భద్రత లేకుండా పోయింది. దీనిపై వివేకా కుమార్తె సునీత, అటు దస్తగిరి బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న కేసు దర్యాప్తును తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రిం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అచ్చం జగన్ అక్రమాస్తుల కేసు మాదిరిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తెలంగాణ నుంచి విచారణ కొనసాగించనుంది. అటు తీర్పును వెలువరించే క్రమంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై వివేకా కుమార్తె, భార్య సంతృప్తిగా లేనందున.. వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని ఆదేశాలిచ్చినట్టు స్పష్టం చేసింది. గత మూడేళ్లుగా వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు.

కేసు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఏపీలో జరుగుతున్న విచారణపై విస్మయం కూడా వ్యక్తం చేశారు. కేసులో నిందితులుగా భావించి ఇప్పటికే సీబీఐ కొందర్ని అదుపులోకి తీసుకుంది. అయితే వారు కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. నేరుగా విచారణ అధికారులకే వార్నింగ్ లు సైతం ఇచ్చారు. ఒకటి రెండు సార్లు దాడిచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు పేర్లను అనుమానితులగా పేర్కొంటూ సునీత వాంగ్మూలం ఇచ్చారు. కానీ అటు దిశగా దర్యాప్తు సాగడం లేదు. అందుకే వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే తప్ప విచారణ కొలిక్కి వచ్చే అవకాశం లేదని సునీత కోర్టుకు విన్నవించారు. అటు తెలంగాణ కు బదిలీ చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో.. ఆమె విన్నపాన్ని మన్నించి హైదరాబాద్ ప్రత్యేక కోర్టకు కేసును బదిలీ చేశారు. YS Viveka Murder Case మరోవైపు హత్యకేసులో ఏ5 నిందితుడైన దేవిరెడ్డి శంకర్ రెడ్డి సీబీఐ అదుపులో ఉన్నారు. ఆయన భార్య తులసమ్మ ఫిబ్రవరిలో దాఖలు చేసిన పిటీషన్ ఇటీవల పులివెందుల కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై ఆమె కీలక వాంగ్మూలం ఇచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వివేకా దారుణ హత్యకు గురయ్యారని.. సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. తన భర్తకు ఏపాపం తెలియదని చెబుతూనే ఆమె సీబీఐ విచారణను తప్పుపడుతూ వాంగ్మూలం ఇచ్చారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డిలే హత్యచేశారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా సహకరించారని చెప్పుకొచ్చారు.కోర్టు ముందు కొన్ని సందేహాలను ఉంచారు. ఈ వివరాలన్నింటినీ పులివెందుల కోర్టు రికార్డు చేసుకుంది. అయితే ఇది జరిగిన మూడు రోజులకే వివేకా హత్య కేసును తెలంగాణ కోర్టుకు బదిలీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !