తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపైనా, టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీయార్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తారు.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడితే, దాన్ని అప్పుల తెలంగాణగా కేసీయార్ మార్చారు..’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. అధికారంలోకి మనమే వస్తాం.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో భైంసాలో బహిరంగ సభను నిర్వహించారు బండి సంజయ్.
ఈ సభకు ఆటంకాలు కలిగించేందుకు, ప్రజా సంగ్రామ యాత్ర జరగనీయకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందనీ, కోర్టును ఆశ్రయించి అనుమతులు పొందామని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులు చెప్పుకొచ్చారు. భైంసాలో హిందువుల్ని మజ్లిస్ భయపెడుతోందనీ, తెలంగాణ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే గనుక భైంసాలో హిందువులెవరూ భయపడాల్సిన పనిలేదనీ, పచ్చ జెండా (మజ్లిస్) పోతుందనీ, కాషాయ జెండా రెపరెపలాడుతుందనీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మజ్లిస్ పార్టీపై ఘాటైన ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచిత విద్య అందిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.