‘మా నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల. ఆమె అరెస్టు మాకు బాధాకరం. అయితే, ఆమె రాజకీయ నిర్ణయాలపై మేం స్పందించలేం. ఆమె పార్టీ వేరు.. మా పార్టీ వేరు. తెలంగాణలో రాజకీయాల గురించి మమ్మల్ని మీరు అడగకూడదు. మేం చెప్పకూడదు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలపై గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘తెలంగాణలో పార్టీ పెట్టొద్దని వైఎస్ జగన్ సూచించినా, వైఎస్ షర్మిల వినలేదు. ఆమెతో మా పార్టీకి సంబంధం లేదు..’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
సజ్జల వ్యాఖ్యల్ని ఖండించిన షర్మిల.. ‘సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడతారని నేను ఊహించలేదు.. ఎవరో చెబితే నేనెందుకు ఆగిపోతాను.? పార్టీ పెట్టాలనుకున్నాను, పెట్టాను..’ అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. నర్సంపేటలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, వాటికి కొనసాగింపుగా హైద్రాబాద్లో ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల వెళ్ళడం.. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిన విషయాలే. కాగా, షర్మిల అరెస్టు బాధాకరమంటున్న వైసీపీ నేత సజ్జల, ఏపీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నేతల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నప్పుడు ఎందుకు బాధపడలేదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మద్దతుదారుల నుంచి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.