మొబైల్ ఫోన్లు పేలతాయ్.. మొబైల్ ఫోన్ ఛార్జర్లూ ప్రాణాలు తీసేస్తాయ్.! చాలాసార్లు ఇలాంటి ఘటనల గురించి విన్నాం, వింటూనే వున్నాం. లోపాలున్న మొబైల్ ఫోన్ల తయారీ ఓ వైపు, వాటిని నిర్లక్ష్యంగా వినియోగించడం ఇంకో వైపు.. వెరసి.. తప్పులు రెండు వైపులా జరుగుతున్నాయి. తాజాగా పదేళ్ళ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జర్‌కి బలైపోయింది. తెలంగాణ లోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, పదేళ్ళ చిన్నారి నిహారిక, మొబైల్ ఫోన్ ఛార్జర్‌ని స్విచ్ బోర్డు నుంచి తీస్తుండగా షాక్‌కి గురైంది.
విద్యుత్ సరఫరా సమస్యలతోనే.. గత కొంతకాలంగా విద్యుత్ సరఫరా సమస్యలు వున్నాయనీ, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదనీ విద్యుత్ అధికారులపై మృతురాలి తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. హై ఓల్టేజీ ఆ సమయంలో వుండడంతో, ఛార్జర్ పట్టుకోగానే షాక్ కొట్టి తమ చిన్నారి చనిపోయిందని మృతురాలు నిహారిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు పెదవి విప్పలేదు. అయితే, పదేళ్ళ చిన్నారి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ప్లగ్ తీసేటప్పుడు ఆ పిన్ వద్ద మెటల్‌ని తాకితే షాక్ కొట్టే అవకాశాలుంటాయి.