టాలీవుడ్‌లో వస్తున్న మరో క్రేజీ కాంబినేషన్ మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌లాంటి మూవీస్‌తో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిన రాజమౌళి.. టాలీవుడ్ సూపర్‌స్టార్‌తో సినిమా తీస్తున్నాడంటే ఎంత ఆసక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తప్ప ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయని మాత్రం చెబుతున్నారు. రాజమౌళి ఇప్పటికీ అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో తన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రమోషన్లలోనే బిజీగా ఉన్నాడు. ఎస్‌ఎస్‌ఎంబీ29 వచ్చే ఏడాది అయినా సెట్స్‌పైకి వెళ్తుందా లేదా అన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళియే మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌ఎంబీ29 గురించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు ఈ దర్శక ధీరుడు. “ఇండియానా జోన్స్‌లాంటి ఓ అడ్వెంచరస్ మూవీ తీయాలని చాలా కాలం నుంచి నేను అనుకుంటున్నాను.
దానికి ఇదే సరైన సమయం అనిపించింది. దీనికి మహేష్ బాబుయే కరెక్ట్ ఛాయిస్. ఇలాంటి సబ్జెక్ట్‌కు సూటవుతాడు. ప్రపంచమంతా తిరిగే ఓ అడ్వెంచరస్ మూవీ ఇది” అని రాజమౌళి చెప్పాడు. ఈ సినిమాకు కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్నాడు. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథను అందించబోతున్నట్లు గతంలోనే విజయేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కూడా ఈ కథనే ధృవీకరించాడు. యాక్షన్, థ్రిల్స్, డ్రామా అన్నీ కలబోసి ఎస్‌ఎస్‌ఎంబీ29 ఉండబోతోంది. 2023లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటించబోయే మిగతా నటీనటుల గురించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్‌ఆర్ మూవీని ఆస్కార్స్‌లోకి పంపించే పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి.. అది పూర్తయిన తర్వాతే ఎస్‌ఎస్‌ఎంబీ29పై పూర్తిస్థాయిలో దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఎస్‌ఎస్‌ఎంబీ28 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ కృష్ణ మరణంతో కాస్త ఆలస్యమవుతోంది.