సర్వసభ్య సమావేశం ఎందుకు?
ప్రగతి నివేదికలు సమర్పించడంలో అధికారుల నిర్లక్ష్యం
సరైన చర్యలు తీసుకోవాలని మండలాభివృద్ధి అధికారికి ఆదేశాలు: ఎంపీపీ
మన్యం న్యూస్, పినపాక:
ప్రగతి నివేదికలు సమర్పించని ఆయా శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులును ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు సమర్పించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, కొన్ని శాఖల అధికారులు ప్రగతి నివేదికలు సమర్పించలేదని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సర్వసభ్య సమావేశానికి ప్రగతి నివేదికలు చేయకుండా సమావేశం నిర్వహించడం ఎందుకని మండిపడ్డారు. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతున్నా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశానికి హాజరుకాని ఆర్ డబ్ల్యు ఎస్, గిరిజన సంక్షేమ శాఖ, పశు వైద్య శాఖ, ఐకేపి (వెలుగు) శాఖల నుండి వివరణ కావాలని, మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. సర్పంచులు,ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికైనా, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడానికి అయినా సమాచారం ఉండాలని అది లేనప్పుడు సర్వసభ్య సమావేశాలు ఎన్ని నిర్వహించిన దండగే అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.