ఎర్రబోడు గోత్తికోయ గ్రామ బహిష్కరణ సరికాదు…
* తుడుందెబ్బ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముక్తి రాజు…
మన్యం న్యూస్ చండ్రుగొండ నవంబర్ 30 : మండల పరిధిలోని బెండాలపాడు గ్రామపంచాయతీ శివారు ఎర్రబోడు గ్రామాన్ని సందర్శించిన తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తిరాజు గొత్తికోయలను గ్రామసభలో గ్రామ బహిష్కరణ తీర్మానం చేయడం సరైనదికాదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేంజర్ శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ, ఇద్దరు చేసిన తప్పుకి, ఎర్రబోడు కు చెందిన గొత్తికోయల కుటుంబలను గ్రామసభలో గ్రామ బహిష్కరణ తీర్మానం చేయడం సరైనది కాదని, భారత రాజ్యాంగంలో ఎక్కడైనా జీవించేహక్కు ఉందని, ఆదివాసులకు అడివే మూలధారమని, అడవుల్లో జీవించే నైతికహక్కులు ఆదివాసులకు ఉన్నాయన్నారు. ఈ సంఘటనను సాకుగా చూపిస్తూ ఆదివాసీలను అడవి నుండి పంపివేయాలని ఆలోచన తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని, గ్రామ సభ తీర్మానం వెనక్కి తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం నుండి తొలగించాలని, సర్పంచును పదవి నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సనప కోటేశ్వరరావు, తెల్లం నరసింహారావు, తాటి రామారావు, సాయం లక్ష్మీ నర్సు, పులసమ్ భద్రం, తాటి పుల్లయ్య, పూసం సుధీర్, ముక్తి కోటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.