ఏపీలో వైసీపీ నేతలది ఒకటే పంథా. వారికి ఎదురుదాడి తప్ప మరో ఆలోచన తెలియదు. రాదు కూడా. ప్రత్యర్థులపై మాటల దాడి చేయడం, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మంచిని ఆహ్వానించలేరు. మంచి మాటలను స్వాగతించలేరు. సమయం, సందర్భం అనేది చూడరు. తమ రాజకీయానికి పనికొస్తుందన్న ఏ అంశాన్ని జారవిడుచుకోరు. ఇప్పుడు పవన్ విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఆయన ఆలోచనతో మాట్లాడినా సహించలేకపోతున్నారు. ఆవేశంతో మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. తాజాగా పవన్ చేసిన ‘తాను విఫలనేత’ను అన్న కామెంట్స్ ను వైరల్ చేసి కాక రేపుతున్నారు. పవన్ ను ఏపీ సమాజంలో ఒక బలహీనమైన నేతగా చూపే ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు తెలిసిన జుగుప్సాకర రాజకీయాన్ని తెరపైకి తెచ్చి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. పవన్ తాజాగా చేసిన ప్రసంగం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన చేసింది రాజకీయ ప్రసంగం కాదు. పైగా ఈ రాష్ట్రంలోనూ అంతకంటే కాదు. శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు ఇండియాలో వివిధ ప్రాంతాల విద్యార్థుల కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ సంస్థ ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో చేసిన కీలక ప్రసంగం అన్న మాట మరిచిపోతున్నారు. రాజకీయ భావజాలానికి వ్యతిరేకంగా పూర్తిగా రియలైజేషన్ తో పవన్ 37 నిమిషాల పాటు ప్రసంగించారు. చివర్లో ఐదు నిమిషాలు తప్పించి.. అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ పవన్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
విద్యార్థి, యువతకు విశేషంగా ఆకట్టుకున్న పవన్ స్పీచ్ ఏపీలో వైసీపీ శ్రేణులకు మాత్రం కంటగింపుగా మారింది. నిగూడార్థాలతో, వాస్తవికతకు దగ్గరగా ఉన్న పవన్ మాటలను ఇప్పుడు ఫెయిల్యూర్స్ గా చూపించి జన సైనికుల ఆత్మస్థైర్యంపై దెబ్బ కొట్టేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించడం మాత్రం హేయమైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వ్యక్తి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి అతడి విజయాలనే పరిగణలోకి తీసుకోకూడదని.. తుపానుకు తట్టుకొని ఎలా నిలబడ్డాడు అనేదే ఆ వ్యక్తి సక్సెస్ గా తాను గుర్తిస్తానని పవన్ అన్నారు. ఈ క్రమంలో తనను ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. తాను ఒక ఫెయిల్యూర్ లీడర్ నని చెప్పి.. దాని నుంచి సక్సెస్ అందుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వివరించే యత్నం చేశారు. విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా నిర్వాహకులు తనను ఆహ్వానించినందున అక్కడకు వెళ్లి సుదీర్ఘ సమయం కేటాయించారు. కానీ దానిని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ గా పిలవబడే కొంతమంది యత్నించడంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్టు అయ్యింది. పవన్ తాను విఫల నేతను అనుకుంటున్నారని.. ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ ను ఒక రాజకీయ పార్టీ అధినేతగా కూడా ఆయన ఒప్పుకోలేదు. సినిమా హీరోగా అభివర్ణిస్తూ పోస్టు పెట్టారు. దీనినే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా జన సైనికులు కళ్లు తెరవాలని కూడా సూచిస్తున్నారు. పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నేతనని.. ప్రజల్లో కూడా అదే భావన ఉందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై జన సైనికులు, అభిమానులు అదేస్థాయిలో రియాక్టవుతున్నారు. కళ్లుండి చూడలేని మేత నేతలు వైసీపీ వారంటూ ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు ఫెయిల్యూర్ నేతలో తేలిపోతుందని సవాల్ చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ ఆవేశంగా మాట్లాడినా, ఆలోచనతో మాట్లాడినా ఎదురుదాడే మా అస్త్రం అన్నట్టు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.