UPDATES  

 వన్డే సిరీస్ నుంచి PANTH ఔట్.. కారణం చెప్పిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. తొలి వన్డేకు ముందు పంత్‌ను జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పంత్‌ను జట్టు నుంచి విడుదల చేశామని.. అతని స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని ట్వీట్ చేసింది. మెడికల్ టీమ్ సలహా మేరకు రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించామని తెలిపింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే అతను జట్టులో చేరనున్నాడు. అదేవిధంగా తొలి వన్డేకు అక్షర్ పటేల్ అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక మ్యాచ్‌లో 10 పరుగులు, రెండో మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ టూర్ మొత్తం ఫ్లాప్ అవ్వడంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా బంగ్లాదేశ్ పర్యటనకు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇపుడు అనూహ్యంగా జట్టు నుంచి విడుదలయ్యాడు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం ఢాకా వేదికగా వన్డే సిరీస్ ప్రారంభమైంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా అనుహ్య మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తుండగా.. కుల్దీప్ సేన్ ఈ వన్డేలో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 250వ ఆటగాడిగా నిలిచాడు. కివీస్ సిరీస్‌లో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్, యంగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. శిఖర్ ధావన్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమి పాలైన టీమిండియాకు ఈ సిరీస్‌ కీలకంగా మారింది. భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !