మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 09: గల్లీ నుంచి ఢిల్లీ పీఠం వరకు రాజ్యాధికారాన్నిసాధిద్దామని డి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్మహారాజ్ అన్నారు. ఆయన సోమవారం మణుగూరుకు చేరుకున్న పది వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర సందర్బంగా డి ఎస్ పి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నూటికి పది శాతం లేని అగ్రకులాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏలినప్పుడు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలం ఈ దేశాన్ని ఏలవద్దా అని ప్రశ్నించారు. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు, గోదావరిఖని ప్రాంతాల్లో బొగ్గు గనులు తవ్వేది ఆ బొగ్గుతో వెలుగులు సృష్టించింది ఈ అణగారిన అట్టడుగు వర్గాలేనని గుర్తుంచుకోవాలన్నారు. డీఎస్పీ జెండా భారత రాజ్యాంగాన్ని రక్షిస్తూ అణగారిన వర్గాలకు అండగా ఉంటుందన్నారు. స్వరాజ్య పాదయాత్ర ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ లందరినీ ఏకం చేసి సబ్బండ వర్గాలని స్వరాజ్యాన్ని సాధించే దిశగా రాజకీయ ఓటు చైతన్యం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ మధు, జిల్లా ఇన్చార్జి తలారి రాంబాబు, శత్రు నాయక్, సతీష్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.