‘ఇప్పటం’ గ్రామస్థులు.. జనసేన ఆవిర్భావ సభ కోసం తమ భూములు ఇవ్వడమే వీరు చేసిన పాపం. అప్పటి నుంచి జగన్ సర్కార్ ఆగ్రహానికి బలి అవుతూనే ఉన్నారు. మొదట భూములిచ్చిన రైతులను బెదిరించారు. వారికి పథకాలు కట్ చేశారు. ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని.. ఆ మారు మూల గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో జనసేనకు భూములిచ్చిన రైతుల ఇళ్లను కూలగొట్టించారు. వైసీపీ ప్రభుత్వ ప్రతీకారానికి పాపం ఇప్పటం రైతులు బలయ్యారు. అందుకే ఇప్పటంలో ఇళ్లు కూలగొట్టగానే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించి వైసీపీ దమనకాండను ఎలుగెత్తిచాటాడు. తీవ్ర విమర్శలు గుప్పించారు. బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. అన్నట్టుగా ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఈ నెల 27న పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం అందిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.
మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రూ.లక్ష చొప్పున చెక్కులను అందిస్తారని పేర్కొంది. జనసేన ఆవిర్భావ వేడుకలకు ఇప్పటం వేదికగా నిలిచిందని.. కార్యక్రమం కోసం ఆ గ్రామ రైతులు పొలాలను ఇచ్చారని గుర్తు చేసింది. రహదారి విస్తరణపేరుతో కొన్ని ఇళ్లను కూల్చడంతో పవన్ చలించిపోయారని తెలిపింది. ఇప్పటం రైతులకు అండగా ఉంటానని ఈ చర్య ద్వారా పవన్ కళ్యాణ్ చాటి చెప్పనున్నారు. అందుకే స్వయంగా కదిలివస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా సరే తమ పార్టీకి అండగా నిలిచివారి కోసం పవన్ కళ్యాణ్ తరలివస్తున్నారు. వారికి ఆర్థిక సాయాన్ని స్వయంగా అందజేయనున్నారు.