ప్రతి సీజన్‌లోనూ ఆ సీజన్‌లో ఉన్న వాతావరణంకు అనుగుణంగా ప్రత్యేకమైన అలర్జీలు ఉంటాయి. వేసవిలో గాలిలోని పుప్పొడితో అలర్జీలు కలిగితే, వర్షాకాలంలో తడి వాతావరణంలో వృద్ధి చెందే ఫంగస్, బ్యాక్టీరియాలతో అలర్జీలు కలుగుతాయి. ప్రస్తుతం శీతాకాలంలో దుమ్ము, పొగమంచు అలర్జీలు కలుగజేస్తాయి. ఈ చలికాలంలో దుమ్ము తక్కువ ఎత్తులో వీస్తుంది, అందులోనూ మన నగరాల రోడ్లపై దుమ్ము ఎలా ఉంటుందో తెలిసిందే, ఒక వాహనం వెళ్లిందంటే వెనక వచ్చేవారి పరిస్థితి అంతా దుమ్ముమయం అన్నట్లుగా ఉంటుంది. ఈ దుమ్ములో చిన్నచిన్న పురుగులు ఉంటాయి, ఇవి డస్ట్ అలెర్జీని కలుగజేస్తాయి. దీంతో దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఈ డస్ట్ అలర్జీని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ డస్ట్ అలర్జీలను ఎదుర్కోవడానికి ఆయుర్వేదంలో కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. మన ఇంట్లో లభించే సుగంధ దినుసులతో డస్ట్ అలర్జీలకు చెక్ పెట్టవచ్చు. Dust Allergy- Ayurvedic Remedies- డస్ట్ అలర్జీలకు ఆయుర్వేద నివారణలు ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్దా, చలికాలంలో తలెత్తే డస్ట్ అలర్జీలను ఎదుర్కోవటానికి కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణలను పంచుకున్నారు. అవేంటో ఇక్కడ చూడండి. పసుపు పాలు పసుపును సంస్కృతంలో ‘హరిద్ర’గా పేర్కొంటారు,
ఇది డస్ట్ అలర్జీ లక్షణాలు సహా అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేసే ఒక శక్తివంతమైన మసాలా. పసుపు పర్యావరణ చికాకులు, స్థిరమైన దగ్గు, నొప్పులను తగ్గిస్తుంది. రాత్రిపూట నిద్రవేళకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల డస్ట్ అలర్జీ నివారణకు సహాయపడుతుంది. తులసి ఆవిరి టీ తులసిలో బయోయాక్టివ్, యాంటీమైక్రోబయల్ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. తులసి డస్ట్ అలెర్జీలతో సహా అనేక శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించే పురాతన ఇంటి నివారణ. తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో మరిగించి, ఆ సారాన్ని స్వేదన చేసి తులసి మూలికా పానీయం సిద్ధం చేయండి. ఈ తులసి టీని సిప్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్, డస్ట్ అలర్జీల సంకేతాలను తొలగిస్తుంది. నల్ల జీలకర్ర నూనె నల్ల జీలకర్రను సంస్కృతంలో ‘కృష్ణ జీరకా’ అని పిలుస్తారు, నల్ల జీలకర్ర లేదా కలోంజీ అనేది యాంటీమైక్రోబయాల్ ఏజెంట్ల స్టోర్‌హౌస్. ఇది శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ , వాపును అడ్డుకుంటుంది. నల్ల జీలకర్ర నూనె అలెర్జిక్ రినిటిస్‌కు చక్కని మూలికా ఔషధం. ఈ నూనెను ముక్కు, గొంతుపై రోజుకు రెండుసార్లు పూయడం , మసాజ్ చేయడం వలన నాసికా , నోటి భాగాల డీకంజషన్‌లో సహాయపడుతుంది. యోగా అనేక రకల మానసిక, శారీరక అస్వస్థతలను నయం చేసే ఒక గొప్ప థెరపీ. అలర్జీలను నయం చేసే ఆసనాలు కూడా ఉన్నాయి. అర్ధచంద్రాసన, పవనముక్తాసన, వృక్షాసన, సేతుబంధాసన అలర్జీలకు ప్రయోజనకరమైన యోగాసనాలు. ప్రాణాయామం (శ్వాస వ్యాయామం) అలెర్జీ కారకాలకు శరీరం గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా సహాయపడుతుంది. ఇది శరీర కణాలకు సరైన పోషణ అందిస్తుంది, వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.