UPDATES  

 ఫ్యాటీ లివర్ నయం కావాలంటే టిప్స్

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఎప్పటికప్పుడు మలినాలు బయటకు వెళ్లిపోవాలి. ఈ ప్రక్రియలో లివర్ పాత్ర చాలా కీలకమైంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, లాక్‌డౌన్ సమయాల్లో కదలిక లేని జీవన శైలి చాలా మందిలో ఈ లివర్ సంబంధిత సమస్యలు తెచ్చిపెట్టాయి. ఈరోజుల్లో ప్రతి కుటుంబంలో ఒకరు ఈ ఫ్యాటీ లివర్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫ్యాటీలివర్ అనారోగ్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యగా మారింది. పైగా ఇది డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఒబెసిటి, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్యాలకు కారణమవుతోంది. ముఖ్యంగా చిన్న వయస్సుల్లోనే వస్తున్న ఈ సమస్య వల్ల ఉత్పన్నమవుతున్న కార్డియాక్ సమస్యలను త్వరితగతిన గుర్తించాలి. What is fatty liver: ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? శరీరంలో ఆల్కహాల్ ఎక్కువైనప్పుడు లివర్ చుట్టూ అసాధారణ స్థాయిలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన టిష్యూను స్కార్ టిష్యూ రీప్లేస్ చేస్తుంది. ఈ కారణంగా ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువై లివర్ పనిచేయకుండా పోతుంది. అంతిమంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దారితీస్తుంది. ఆల్కహాల్‌తో పాటు ఇతర పరిస్థితులు కూడా ఇందుకు దారితీయవచ్చు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కూడా మరో రకమైన లివర్ జబ్బు. దీనికి ఆల్కహాల్‌తో సంబంధం లేదు. అధిక బరువు, ఒబెసిటీ ఇందుకు కారణమవుతాయి. అంటే చక్కెర గల పదార్థాలు ఎక్కువగా తినడం, ప్రాసెస్డ్ ఆహారం ద్వారా కార్బొహైడ్రేట్లు అధిక స్థాయిలో తీసుకోవడం, కదలిక లేని జీవనశైలి (సెడెంటరీ లైఫ్‌స్టైల్), మెటబాలిక్ సిండ్రోమ్ కలిగి ఉండడం ఈ పరిస్థితికి కారణమవుతుంది.

ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య అయి కూర్చుంది. టిప్స్ ఇవే ఆన్‌క్వెస్ట్ లాబ్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుష్రుత్ పౌనికర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఫ్యాటీ లివర్ నయం కావాలంటే లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలి. చాలా సాధారణమైన డైట్ తీసుకోవాలి. కొందరి విషయంలో ఉపవాసం పనిచేస్తుంది. శాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్‌ తగ్గించి అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అలాగే గ్లైసెమెక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ డ్రింక్స్ తగ్గించాలి. అయితే తక్కువ కొవ్వు గల పాలతో చక్కెర లేకుండా రోజూ 2 నుంచి 3 సార్లు కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌ నయం కావడానికి దోహదం చేస్తుందని పేరుంది. ఆల్కహాల్ కూడా అతి తక్కువ మోతాదులో మేలు చేస్తుందని, ఎక్కువ డోస్ అయితే ప్రమాదకరమని అధ్యయనాల్లో తేలింది. ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, ఇతర ఏరోబిక్ యాక్టివిటీ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. 6 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్రించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, యూఎస్‌జీ టెస్ట్, వంటి పరీక్షలను వైద్యులు సిఫారసు చేస్తారు. అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందని మనకు మనం గుర్తించలేం. వైద్యుడి సిఫారసుల ఆధారంగా గుర్తించి, వారి సిఫారసుల మేరకే పై మార్పులు చేసుకోవాలి..’ అని వివరించారు. ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారు షుగర్ తగ్గించాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలు, ఆర్గానిక్ ఫ్రూట్స్ మీ డైట్‌లో భాగం కావాలి. అధిక కొవ్వులు ఉండే ఆహారం లివర్ విధులకు సవాలుగా మారుతుంది. దాల్చిన చెక్క, ఆపిల్ సైడర్ వెనిగర్, పసుపు, ఉసిరి వంటివి ఫ్యాటీ లివర్ అనారోగ్యాన్ని క్రమంగా తగ్గిస్తాయి. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగితే అవి శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా, రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తాయి. జాయ్‌వెల్ కో-ఫౌండర్ సుజీష్ సుకుమారన్ కొన్ని సిఫారసులు చేశారు. ‘లైఫ్‌స్టైల్‌లో మార్పులు తప్పనిసరి. ఫ్యాటీ లివర్ క్రమంగా లివర్ డిసీజ్‌గా మారకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి. ఫ్యాటీ లివర్ డిసీజ్ పెద్దగా లక్షణాలేవీ చూపదు. కానీ చికిత్స తీసుకోకుంటే మాత్రమే తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. అధిక బరువు, అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్న వారిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటిక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హైబీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్న వారిలో సమస్య తీవ్రమవుతుంది. బరువు తగ్గడం అనేది ఒక్కటే ఫ్యాటీ లివర్ ముదరకుండా చూస్తుంది. ఫైబ్రాసిస్, ఇన్‌ఫ్లమేషన్‌ రాకుండా చూస్తుంది. బరువు తగ్గేందుకు చేసే వ్యాయామాల్లో ఏరోబిక్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ రెండూ ఉండాలి..’ అని సూచించారు. మిల్క్ థిజిల్ పండులోని విత్తనాలు కాలేయ వ్యాధుల నుంచి రక్షణకు పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీలివర్ దీని కారణంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే పసుపు రంగులో పువ్వులను ఇచ్చే సింహపర్ణి చూర్ణం అనేక కాలేయ వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిత్తాశయ సమస్యలకు, మూత్రపిండ వ్యాధులకు, అధిక రక్తపోటుకు పనిచేస్తుంది. వేర్లతో సహా తెచ్చి కడిగి దంచి రసాన్ని రోజూ రెండు పూటలా తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !