ఎవరో సలహా ఇస్తే పాటించే రకం కాదు జగన్ ది. తాను అనుకున్నది..తనకు అనుకూలమైనదే చేస్తాడు తప్ప ప్రతికూల ఫలితాలు ఇస్తాయన్న వాటి జోలికి వెళ్లడు. ఆ సాహసం కూడా చేయడు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుంగ మిత్రుడు, జగన్ శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ బెత్తం పట్టి దండించినట్టు ఎప్పటికప్పడు జగన్ కు సలహాలు ఇస్తుంటారు. ఆయన ఎప్పుడు విలేఖర్ల ముందుకు వచ్చినా అది జగన్ హితం కోసమే. కానీ పాపం ఆయన సలహాలు స్వీకరించినట్టు ఎప్పుడూ కనిపించలేదు. ఆ మధ్యన మార్గదర్శి విషయంలో సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడంతో ఉండవల్లి తెగ సంబరపడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలకు దిగడంతో తాను దాఖలు చేసిన పిటీషన్ కోసమేనని ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు ఉండవల్లి దాఖలు చేసిన రాష్ట్ర విభజన వ్యతిరేక పిటీషన్ విచారణ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఉండవల్లి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. తాజాగా ఆవేదన స్వరంతో మీడియా ముందుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. Undavalli Arun Kumar- jagan జగన్ ను రాష్ట్రం కోసం పోరాటం చేయాలని సూచిస్తున్నారు. చంద్రబాబు అలా చేయకపోవడం వల్లే లాస్ట్ టైమ్ 23 సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తుచేసి మరీ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంపై యుద్ధం చేయకుంటే మాత్రం జగన్ రాజకీయ జీవితం ముగిసినట్టేనని తేల్చిచెబుతున్నారు. తన పిటీషన్ విచారణ అవసరం లేదని జగన్ సర్కారు తిరస్కరించడంతో ఇప్పుడు ఉండవల్లికి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొచ్చినట్టున్నాయి. విభజన సమస్యలు అలానే ఉండిపోయాయని.. తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్లు ఆస్తులు రావాల్సి ఉందని చెబుతున్నారు.
విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారని కూడా ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జగన్ పోరాడకుంటే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని కూడా ఉండవల్లి తేల్చేస్తున్నారు. ఇదే ఉండవల్లి కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతిభవన్ కు వెళ్లి రెండు గంటల పాటు చర్చించారు. అక్కడే భోజనం చేసి అతిథి మర్యాదలు స్వీకరించారు. రాజమండ్రికి వచ్చి మరీ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. కేసీఆర్ లాంటి మహా నాయకుడు ఈ దేశానికి, సమాజానికి అవసరమని కూడా చెప్పుకొచ్చారు. కానీ మా రాష్ట్రానికి లక్ష కోట్ల ఆస్తులు మీ నుంచి రావాలి అని ప్రస్తావించలేకపోయారు. కనీసం మా సమస్య ఇది అని చెప్పలేకపోయారు. కేసీఆర్ అంత చనువు ఇచ్చినా.. కోర్టుకెళ్లి తేల్చుకుంటామన్న రీతిలో వ్యవహరించేరే తప్ప మాటలతో పెద్దమనిషి పాత్ర పోషించి సమస్య పరిష్కరిద్దామన్న ఆలోచన చేయలేదు. జగన్ కు మోదీతో మంచి సంబంధాలున్నాయని కూడా ఉండవల్లి చెప్పుకొస్తున్నారు. అయితే ఇది చాలా పాత మాటే. కానీ దానినే గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో ఉన్న స్నేహాన్ని జగన్ ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఫైట్ చేయాలని కూడా చెబుతున్నారు. అయితే ఇక్కడే ఉండవల్లి ఒక లాజిక్ మిస్సవుతున్నారు.కేంద్రంతో పోరాడిన మరుక్షణం జగన్ రాజకీయ భవిష్యత్ ఫుల్ స్టాప్ పడుతుందన్న కనీస విషయం మరిచిపోతున్నారు. జగన్ పై కొత్తగా కేసులు సృష్టించాల్సిన పనిలేదు. పాత కేసులను యాక్టివ్ చేస్తే చాలూ సరిపోతుంది. ఏ కేసులు లేని కేసీఆర్ కే ముప్పు తిప్పలు పెడుతున్నారు. కుమార్తె కవితను ఏకంగా సీబీఐ నోటీసులిచ్చారు. విచారణకు హాజరుకావాలని సైతం తాకీదులిచ్చారు. ఇప్పుడు జగన్ ను హెచ్చరిస్తున్నారా? లేకుండా సలహా ఇస్తున్నారా? అన్నది తేల్చుకోలేని స్థితిలో ఉండవల్లి మాట్లాడుతున్నారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.