టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను ‘లిక్కర్ క్వీన్’గా అభివర్ణిస్తోంది బీజేపీ. ఇప్పటికే సీబీఐ ఆమెకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఆమె విచారణకు హాజరు కానున్నారు కూడా. మరోపక్క, ఈడీ ఈ కేసులో పట్టుబడ్డ నిందితుడికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరుని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కేసులతో రాజకీయంగా నోరు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తోందంటూ కవిత ఆరోపిస్తున్నారు. విచారణకు సహకరిస్తానని చెబుతున్నారు. తప్పు చేయలేదని ఘంటాపథంగా చెబుతున్నారామె. కేసీయార్ రాజీ ప్రయత్నం చేస్తున్నారా.?
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తన కుమార్తె కవిత విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదనీ, ప్రధాని మోడీ తో రాజీకి సిద్ధమవుతున్నారనీ ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అయితే, కేసీయార్ రాజీ పడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ శ్రేణులంటున్నాయి. తెలంగాణలో ప్రజా ప్రతినిథుల కొనుగోళ్ళకు ఎర కేసు నడుస్తోంది. ఈ కేసులో బీజేపీని టార్గెట్ చేసింది టీఆర్ఎస్. దానికి విరుగుడుగా లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు తెరపై కొచ్చినట్లు కనిపిస్తోంది.ఈ రెండు కేసుల్లో ఎవరు తగ్గుతారు.? ఎవరు నిలబడతారు.? అన్నది ముందు ముందు తేలుతుంది.