హైదరాబాద్ అతి పురాతన థియేటర్లలో తారకరామ కూడా ఒకటి. కాచీగూడలో ఉండే ఈ థియేటర్ పదేళ్ల క్రితం మూతపడింది. అయితే త్వరలో ఇది మళ్లీ పునఃప్రారంభం కాబోతుంది. కొన్నాళ్లుగా ఈ సినిమా హాల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో మళ్లీ రీ ఓపెన్ కానుంది. ఈ సారి ఏషియన్ తారకరామ(Asian Tarakarama). మరమ్మతులతో సరికొత్త హంగులను సంతరించుకున్న ఈ థియేటర్‌ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. డిసెంబరు 14న బాలయ్య చేతుల మీదుగా ఈ థియేటర్ రీ ఓపెన్ అవనుంది.
నటసౌర్వభౌమ దివంగత నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ నిర్మాత నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ ఈ థియేటర్‌కు మరమ్మత్తు చేపట్టారు. సరికొత్త హంగులు, సోబగులు ఈ థియేటర్‌కు అద్దారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. ఒకప్పుడు 975 సీటింగ్ సామర్థ్యమున్న థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని అందించేలా 590కి తగ్గించారు. రెక్లేనర్, సోఫాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డిసెంబరు 14న నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఏషియన్ తారకరామ పునఃప్రారంభం కాబోతుంది.
అనంతరం డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం అవతార్ 2ను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంతో థియేటర్ రీ ఓపెన్ కాబోతుంది. ప్రస్తుతం బాలకృష్ణ వీర సింహా రెడ్డి చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య మరో సినిమాకు పచ్చజెండా ఊపారు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలతో అన్‌స్టాపబుల్ షోతోనూ అభిమానులను అలరిస్తున్నారు మన బాలయ్య.