శ్రీనివాస్ అవసరాల.. మంచి టాలెంట్ ఉన్న నటుడు, దర్శకుడు, కథా రచయిత. టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా, రైటర్‌గా ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందలాంటి మూవీస్ అందించాడు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అంటూ మరో సరికొత్త టైటిల్‌తో త్వరలోనే మరోసారి డైరెక్టర్‌గా, రైటర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక నటుడిగా మరెన్నో సినిమాల్లో మెప్పించాడు. అలాంటి మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అయిన శ్రీనివాస్ అవసరాల ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 మూవీకి తెలుగులో డైలాగ్స్ అందించడం విశేషం.
2009లో వచ్చిన అవతార్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మొత్తం ఐదు భాగాలుగా రానున్న ఈ అవతార్ మూవీలో రెండో పార్ట్ 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతోంది. ఇక మూడో పార్ట్ 2024లో, నాలుగో పార్ట్ 2026లో, ఐదో పార్ట్ 2028లో రిలీజ్ కానున్నాయి. జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 2009లో వచ్చిన అవతార్ ఇప్పటికీ ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిపోయింది.
దీంతో ఇప్పుడా రికార్డును ఈ అవతార్ 2 బీట్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాంటి మూవీ తెలుగులోనూ డబ్ అయింది. దీనికి శ్రీనివాస్ అవసరాల డైలాగులు అందించడంతో అతని మార్క్ ప్రత్యేకమైన మాటలు ఇందులో వినిపించనున్నాయి. ఇప్పటి వరకూ అతని సినిమాల్లో డైలాగ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పుడీ అవతార్ 2లోని కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు అతని మాటలు తోడైతే తెలుగు ప్రేక్షకులకు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది?