ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా తన ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదను ఆయన కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ దాని వల్ల తీవ్ర నష్టాల పాలయ్యాడు అంటూ ప్రచారం జరగడంతో ఆయన టెస్లా యొక్క షేర్ల విలువ భారీగా పతనం అయింది. ప్రతి రోజు మంచులా ఆయన ఆస్తి కరిగి పోతూ ఉండడానికి కారణం టెస్లా షేర్ల యొక్క పతనమే కారణం అంటూ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
సుదీర్ఘ కాలంగా ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ గా నిలుస్తూ వచ్చిన మస్క్ ఇప్పుడు నెంబర్ 2 స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విల్టన్ పేరెంట్ కంపెనీ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ప్రాన్స్ కి చెందిన ఈయన 188.6 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో ఉండగా.. మస్క్ 176 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ట్విట్టర్ కొనుగోలు చేసి మస్క్ చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ ఆయన సన్నిహితులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే టెస్లా యొక్క స్థాయి తగ్గింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి అత్యంత దారుణమైన పరిస్థితిని ఎలాన్ మస్క్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. దీని నుండి ఆయన ఎలా బయటపడతాడో చూడాలి.