వైసీపీ ఓటమిని అంత ఈజీగా అంగీకరించే పరిస్థితి ఉండదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంది. అవసరమైతే గొడవలకు దిగుతుంది. విధ్వంసాలు సృష్టించి మరీ గెలుస్తుంది. ఇది రాజకీయాలపై అవగాహన ఉన్నవారు చెప్పుకొస్తున్న మాట ఇది. అయితే ఇది ముమ్మాటికీ నిజమేనని గత వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధికారం చేపట్టిన తరువాత ఉదంతాలు గమనిస్తే అది ఇట్టే తెలిసిపోతుంది. గ్రామస్థాయి నాయకుడు నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు సీఎం వరకూ ఒకటే పంథా. వారి నుంచి సంయమనం అన్న మాట వినిపించదు. అటువంటి చర్యలు కనిపించవు. వారికి తెలిసిందల్లా మాటల దాడులు, విధ్వంసానికి పిలుపులు. అందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతున్నా.. జగన్ సర్కారు ఏదో రకంగా వర్కవుట్ చేసి గెలుస్తుందన్న మాట అందరి నోట వినిపిస్తుంది. అందుకే కాబోలు ఇప్పుడు పవన్ కొత్త స్లోగన్ ఇవ్వడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయని.. వాటిని ఎదుర్కొవడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. Pawan Kalyan- jagan సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబసభ్యులకు నగదు అందించిన తరువాత పవన్ కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వం వాడుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఎన్నికల్లో కూడా వాడుకునేందుకు ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే గొడవ పడేందుకు సాహసించాలి. వారిని ప్రతిఘటించాలి. వారి విధ్వంసాలను కళ్లారా చూశాం. పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లను తగులబెడుతున్నారు. వారిని అలానే వదిలేస్తే ఓటు వేయని ప్రజలను కూడా దండిస్తారు. మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసేస్తారు. అందుకే ధైర్యం, తెగువ ఉన్నవారు నాతోరండి. ఎన్నికల వ్యూహాలను నేను చూసుకుంటా. ఎన్నడూ అధికారం చూడని వర్గాలకు పవర్ దక్కేలా చేస్తా. అందుకు మీరు చేయాల్సిందల్లా జనసేనకు సపోర్టు చేయడమేనని పవన్ పిలుపునిచ్చారు. 2014 మాదిరిగా కూటమి ఉంటే వైసీపీకి ఈ పవర్ వచ్చేదా అంటూ కూడా పవన్ ప్రశ్నించారు. మరోవైపు బీసీలను, కాపులను వైసీపీ సర్కారు ఎలా దగా చేసిందో కూడా పవన్ చెప్పుకొచ్చారు. బీసీల వెనుకబాటుకు కొంతమంది బీసీ నేతలే కారణం. కాపులు అన్యాయానికి గురికావడానికి కాపు నేతలే కారణం. నలుగురు బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే వెనుకబడిన తరగతుల సాధికారతగా చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీల్లో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు? ఎంతమందిని ప్రోత్సహించారు. ఆరేడు శాతం జనాభా ఉన్న సామాజికవర్గాలతో అత్యధిక శాతం మంది ఉన్న కాపులు ఎందుకు పోటీ పడలేకపోతున్నారన్న ప్రశ్న ఈ రెండు వర్గాలు వేసుకుంటే.. వారికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమవుతుందని పవన్ అన్నారు.