ఆరేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా గుర్తుందా? విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అయింది. అదే ఏడాది నోట్ల రద్దు జరగడం.. ఈ సినిమాలో ఓ బిచ్చగాడు.. 500, 1000 నోట్లను రద్దు చేయమని సూచించడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నోట్ల రద్దును బిచ్చగాడు ముందుగానే అంచనా వేశాడంటూ మీమ్స్ హల్చల్ చేశాయి. తల్లి ఆరోగ్యం కోసం కొడుకు బిచ్చగాడు మాదిరిగా దీక్ష చేపట్టే ఈ కథ ప్రేక్షకులకు హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాలని కోరుకున్నారు. ఇప్పటికే ఆ సినిమాను మొదలుపెట్టేశారు కూడా. తాజాగా బిచ్చగాడు-2 గురించి ఆసక్తికర అప్డేట్ చెప్పారు హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగడాడు-2 చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయనున్నట్లు విజయ్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ కళ్లకు ఎరుపు రంగు గుడ్డ కట్టుకుని ఉంటాడు. దానిపై యాంటీ బికిలీ(Anti Bikili) అని రాసి ఉంటుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు విజయ్. అంతేకాకుండా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు తెలియజేశారు. మాతృక తమిళంలో ఈ సినిమాను పిచ్చైక్కరన్ 2 పేరుతో.. తెలుగులో బిచ్చగాడు పేరుతో రానుంది. కన్నడలో భిక్షుకా-2, మలయాళంలో భిక్షాక్కరన్-2 పేరుతో విడుదల కానుంది. బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు గతేడాదే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని వేసవికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.