UPDATES  

 హాలీవుడ్ రేంజ్ కు.. ఆ సినిమాతో కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ కు గుర్తింపు

రాజేంద్రప్రసాద్.. ఈ పేరు వినగానే చాలామంది కామెడీ హీరో అంటారు. ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్టు అంటారు. కానీ.. రాజేంద్రప్రసాద్ అసలు సినీ కెరీర్ ను ఎలా మొదలు పెట్టారు. ఎవరిని చూసి స్ఫూర్తి పొందారు. కెరీర్ తొలినాళ్లలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే విషయాలు చాలామందికి తెలియదు. అసలు రాజేంద్రప్రసాద్ ఏం చదువుకున్నారు? ఆయన సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ ది కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే గ్రామం. సీనియర్ ఎన్టీఆర్ ది కూడా ఇదే ఊరు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్ మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్ నే మెప్పించేవారు రాజేంద్రప్రసాద్. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. కానీ.. ఎన్టీఆర్ ను చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్ కు సినిమాల్లోకి వెళ్లాలని కోరిక ఉండేది. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఫిలిం ఇండస్ట్రీలో చేరారు. గోల్డ్ మెడల్ దక్కినా సినిమా అవకాశాలు మాత్రం దక్కలేదు. ఆకలి పస్తులతో చాలా కాలం పాటు కష్టపడ్డారు కానీ.. చివరకు ఓపిక నశించడంతో చావు తప్ప మరో మార్గం లేదనుకున్నారు. అలాంటి టైమ్ లో ఒక్క అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది. రాజేంద్ర ప్రసాద్ కు తన దగ్గరి బంధువైన సినీ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య కలిశారు. ఆ టైమ్ లో పుండరీ కాక్షయ్య ఎన్టీఆర్ తో మేలు కొలుపు సినిమా తీస్తున్నారు. అయితే.. ఆ సినిమాలో ఒక తమిళ నటుడి పాత్రకు రాజేంద్ర ప్రసాద్ తో డబ్బింగ్ చెప్పించారు ఆయన. దీంతో కొన్నేళ్ల పాటు డబ్బింగ్ చెబుతూనే ఎప్పటిలాగే అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. అలా బాపు దర్శకత్వంలో వచ్చిన స్నేహం సినిమాలో ఓ చిన్న రోల్ దక్కింది. అలా రాజేంద్రప్రసాద్ నటించిన తొలిసినిమా 1975 సెప్టెంబర్ 5 న విడుదలైంది.

how rajendra prasad entered telugu cinema industry ఆ తర్వాత ఛాయ, నిజం, మూడు ముళ్ల బంధం, పెళ్లి చూపులు, రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, ఈ చదువులు మాకొద్దు, రోజులు మారాయి, వందేమాతరం లాంటి సినిమాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించారు రాజేంద్ర ప్రసాద్. అలా 1982 లో వంశీ డైరెక్షన్ లో చిరంజీవి, సుహాసిని.. హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మంచు పల్లకి. ఈ సినిమాలో హరి పాత్రతో మంచి నటుడిగా రాజేంద్ర ప్రసాద్ మరో మెట్టు ఎక్కారు. అదే క్రమంలో డైరెక్టర్ వంశీ 1985 లో రాజేంద్ర ప్రసాద్ ను పెట్టి హీరోగా.. ప్రేమించు పెళ్లాడు అనే సినిమా తీశారు. అయితే.. కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి, భానుచందర్, చంద్రమోహన్ లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్న రాజేంద్ర ప్రసాద్.. ప్రేమించు పెళ్లాడు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారారు. కానీ.. ఈ సినిమా నిరాశే మిగిల్చింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా కూడా వంశీ కసితో 1986 లో లేడీస్ టైలర్ అనే సినిమాను రాజేంద్ర ప్రసాద్ తో తీశారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో టైలర్ సుందరంగా జాతకాల పిచ్చోడిగా చాలా అద్భుతంగా నటించాడు. ఆపై అహ నా పెళ్లంట సినిమా ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత అప్ అండ్ డౌన్స్ హీరోగా సాగిన ఆయన ప్రయాణం.. సెకండ్ హీరోగా అలా సాగిపోయింది.ఇక.. ఆ తర్వాత మళ్లీ 1991 లో వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఏప్రిల్ 1 విడుదల సినిమా కంప్లీట్ గా కామెడీ హీరో టాక్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడమ్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శ్రీరామచంద్రులు.. ఇలా బోలెడన్ని సినిమాలు తన స్టయిల్ యాక్టింగ్ తో కామెడీ పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించారు ఆయన. అలా వరుసగా కామెడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా ఆయనకు ముద్రపడిపోయింది. కెరీర్ తొలినాళ్లలో కొన్ని సీరియస్ పాత్రల్లోనూ నటించారు. చిరంజీవి నటించిన ఛాలెంజ్ లో, కాష్మోరా, ప్రేమతపస్సు, ఎర్రమందారం, ముత్యమంతముద్దు లాంటి సినిమాల్లో నటించారు. హీరోగా అవకాశాలు తగ్గిపోతున్న టైమ్ లో ఆయన యాక్టింగ్ కెరీర్ లో ఒక మరిచిపోలేని గుర్తింపు ఇచ్చింది ఆ నలుగురు సినిమా. రఘురాం పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన కంటతడి పెట్టించింది. మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. 2009 లో హాలీవుడ్ లోనూ రాజేంద్ర ప్రసాద్ ఓ సినిమా చేశారు. అది క్విక్ గన్ మురుగన్. ఈ సినిమా 2012 జూన్ లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడింది. వరల్డ్ ఫేమ్ ను తెచ్చి పెట్టింది. సపోర్టింగ్ రోల్స్, కామెడీ వేషాలు వేసే వాళ్లు కూడా హీరోగా సక్సెస్ కావచ్చని ప్రూవ్ చేసిన తెలుగు నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కానీ ఆ కష్టం వెనుక ఆయన నిర్మించుకున్న హ్యూమర్ అనే సపరేట్ ట్రాక్ ఒకటుంది. తర్వాతి కాలంలో ఎందరో హీరోలు ఆ దారిలో ప్రయాణించాలని చూసినా ఆయన అందించిన నవ్వుల మార్కును మాత్రం ఎవ్వరూ క్రాస్ చేయలేకపోయారు. ఇది రాజేంద్ర ప్రసాద్ సినీ ప్రస్థానం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !