మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది గుమికూడి వున్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటోంది కేంద్ర ప్రభుత్వం. అంటే, రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలే కాకుండా, ఇతరత్రా జనసమ్మర్థంగా వున్న చోట్ల కూడా మాస్క్ తప్పనిసరి అన్నమాట. అయితే, భయపడాల్సిందేమీ లేదనీ.. దేశంలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరిగిందని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ తప్పదా..? సినీ నటి పూనమ్ కౌర్, సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోందనీ..
న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి వుండకపోవచ్చన్నది ఆ వార్త సారాంశమనీ, ఈ విషయమై ఎవరు స్పష్టతనిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం గమనార్హం. కొన్నాళ్ళ క్రితం ఆమె, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెంట పాదయాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. దాంతో, ఆమెపై ట్రోలింగ్ కొనసాగుతోంది.. ఇప్పుడది ఇంకాస్త ఎక్కువైంది. లాక్ డౌన్ భయాలు అవసరం లేదని కేంద్రం స్పష్టంగా చెబుతున్నా, జనాల్లో మాత్రం మళ్ళీ లాక్ డౌన్ తప్పదేమోనన్న భయాలు పెరుగుతున్నాయి.