మరో ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి కోసం ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. వీటి లక్ష్యం ఆయా ఎన్నికల్లో గెలుపే కావాల్సి ఉంది. కానీ ఆయా పార్టీల అధినేతలు మాత్రం అంతకు మించిన సమీకరణాలపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్, చంద్రబాబు తమ రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలపై దృష్టిపెడుతుంటే, ఏపీ సీఎం జగన్ మాత్రం ఏపీకే పరిమితం అవుతానని స్పష్టంగా చెబుతున్నారు. చంద్రులిద్దరూ జాతీయ స్ధాయిలో దూకుడుగా వెళుతుంటే, జగన్ మాత్రం స్వరాష్ట్రానికే పరిమితమవుతానంటున్నారు.
ఎప్పుడో తెలంగాణలో రాజకీయం బంద్ చేసి ఏపీలో విపక్షనేతగా సెటిలైన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే తెలంగాణలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ క్యాడర్ ఎప్పుడో చెల్లాచెదురైపోయినా, నేతలంతా ఇతర పార్టీలకు వలసపోయినా ఏమాత్రం పట్టించుకోకుండా ఉండిపోయిన చంద్రబాబు ఇప్పుడు అంతా బావుందన్న రీతిలో తెలంగాణలో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. దీంతో చంద్రబాబు పార్టీ టీడీపీకి తెలంగాణలో సానుకూలంగా కనిపిస్తోంది ఏంటన్న చర్చ జరుగుతోంది. అలాగే అటు కేసీఆర్ తో కానీ, ఇటు ఆయనతో పోరాడుతున్న బీజేపీ నేతలతో కానీ చంద్రబాబుకు సత్సంబంధాలు లేకపోయినా ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు చర్చనీయాంశంగా మారుతోంది.
ఆంధ్రావైపు కేసీఆర్ చూపు..
తెలంగాణలో సొంత పార్టీ టీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించి తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్ని వరుసగా చావుదెబ్బ కొట్టారు. అయితే ఇప్పుడు అవే రెండు పార్టీలతో పోరాడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతో స్వరాష్ట్రం తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు జాతీయ పార్టీని తెరపైకి తెచ్చారు. అంతే కాదు తనను ఎలా రిసీవ్ చేసుకుంటుందో కూడా తెలియని ఏపీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. ఏపీలో ఏ పార్టీతో కేసీఆర్ బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందో ఊహించడం కూడా కష్టంగా ఉంది. అయినా కేసీఆర్ దూకుడు మాత్రం తగ్గడం లేదు.