అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, కొబ్బరి చెట్టు లాగా అరటి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి దాని ఆకు, అరటి పండు ఏదీ వ్యర్థం కాదు. అంతేకాదు అరటి మొక్కలోని ప్రతి భాగం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అందువలన ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహారం నుండి అలంకరణ వరకు అనేక రకాలుగా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు, వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కామధేనువులాగా అడిగిన ప్రతీది ఇవ్వకపోయినా, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి అరటి మొక్కను కల్పతరువు, కామధేనువు అనడంలో ఏమాత్రం తప్పులేదు మరి. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి గెలలు అరటి మొక్కను పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలను కూరగాయగా వండుకోవచ్చు. పండుగా మారితే అరటిపండు లాగా తినేయవచ్చు. అరటికాయల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది, రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది అథెరోస్ల్కెరోసిస్, గుండెపోటు వంటి అనేక గుండె జబ్బులను కూడా నివారిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి కూడా మంచివి. అరటి పువ్వు అరటి పువ్వులలో కరిగే, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. మలబద్ధకం , ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తాయి. ఈ ఫైబర్స్ ఆరోగ్యకరమైన పేగు సూక్ష్మజీవులను మెరుగుపరుస్తాయి. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. అరటి కాండం అరటి కాండాలలో ఫైబర్ ఉంటుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 25 గ్రాముల నుండి 40 గ్రాముల అరటి కాండం తినవచ్చునని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ B6 మొదలైన మూలకాల గొప్ప ఆహార వనరు. అరటి ఆకు అరటి ఆకులను ఎవరూ నేరుగా తినరు. అయితే వీటిలో ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకుల్లో వివిధ రకాల ఆహార పదార్థాలను వండటానికి ఉపయోగిస్తారు. ఆహారాలను అరటి ఆకులో ఉంచి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలోని అన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వ్యాధులను నివారిస్తాయి. అరటి ఆకులో పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేసే ఎంజైమ్ అయిన పాలీఫెనాల్ ఆక్సిడేస్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటితో తయారుచేసిన గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. వేడి వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డిస్తే అద్భుతమైన వాసన వస్తుంది. అందుకే ఈ ఆకులో వేడివేడి అన్నం వడ్డించే సంప్రదాయం వచ్చింది. ఇవి మంచి బాక్టీరిసైడ్లు కూడా. పర్యావరణ అనుకూలమైనవి.