ప్రతీ ఉదయాన్ని సానుకూల ఆలోచనలతో ప్రారంభిస్తే ఆ రోజంతా చురుకుగా పనిచేయవచ్చు. మీ ఉత్పాదకత పెరుగుతుంది, అది మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కొందరే వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. లక్ష్యం దిశగా మీరు చేసే ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవవచ్చు, కాలం పరీక్షలు పెట్టవచ్చు, మీరు చేసిన ప్రయత్నాలు వృధాకావచ్చు, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి హేళన చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ లక్ష్యంపై మీకంటూ ఒక స్పష్టత ఉంటే ఎవరినీ పట్టించుకోనవసరం లేదు, కష్టాలను లెక్క చేయనవసరం లేదు. ఈరోజు మీరు పడే కష్టం, శ్రమ రేపు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలుపుతుంది. పరిస్థితులకు వెరవకుండా చిత్తశుద్ధితో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగేవారికి విజయం ఏనాటికైనా వరిస్తుంది. కొంత ఓర్పు, సహనం కూడా అవసరం. పట్టుదలతో పనిచేసే వారే విజేతలు అవుతారు. మీ రోజును పాజిటివ్ ఆలోచనలతో నింపడానికి, మీలో స్ఫూర్తిని కలిగించడానికి చరిత్రలో గొప్ప వ్యక్తులుగా నిలిచిన, మేధావులుగా పేరుగాంచిన కొందరి ఆలోచనలను, సూక్తులను ఇక్కడ తెలియజేస్తున్నాం.
మీ లక్ష్యం దిశగా మీ రోజులో ఎటువంటి సమస్యలు రాలేదంటే మీరు, మీరు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారని అనుకోవచ్చు. -స్వామి వివేకానంద. మీరు మీ ప్రయత్నంలో విఫలం అయితే దానిని అక్కడే వదిలేయకండి, వైఫల్యమే విజయానికి మొదటి అడుగు- అబ్దుల్ కలాం. ప్రజలు మీపై ఎల్లప్పుడూ రాళ్లు విసురుతారు, ఆ రాళ్లతోనే ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించుకోండి. – రతన్ టాటా నిన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం- అరిస్టాటిల్. మూర్ఖుడు తాను జ్ఞాని అని అనుకుంటాడు, కాని జ్ఞాని తాను ఒక మూర్ఖుడని అనుకుంటాడు- విలియం షేక్ స్పియర్. మనం మన తప్పుల నుంచి కాదు, ఇతరుల తప్పుల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. – ఛత్రపతి శివాజీ మీకు దక్కిన దానితో స్థిరపడకండి, మీకు దక్కాల్సిన దానికోసం మీ ప్రయత్నం ఆపకండి. – ఆచార్య చాణక్య ఎవరైనా మీపై రాళ్లు వేస్తే వాటిని మైలురాళ్లుగా మలుచుకోండి. – సచిన్ టెండూల్కర్.