బాలీవుడ్ చిత్రాల పాటలపై రష్మిక మందన చేసిన తాజా వ్యాఖ్య సౌత్ ఇండియన్ సినిమా అభిమానులకు నచ్చలేదు. తన రాబోయే హిందీ చిత్రం మిషన్ మజ్ను పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో రష్మిక మాట్లాడారు.
బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ బాగుంటాయని చెప్పుకొచ్చారు. దక్షిణాది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్, డ్యాన్స్ ఉండే పాటలు ఉంటాయని చెప్పారు. దక్షిణాది చిత్రాల సంగీతం, పాటల గురించి రష్మిక చేసిన ఈ వ్యాఖ్య అభిమానులను నిరాశకు గురిచేసింది. కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేయగా, మరికొందరు ఆమెతో ఏకీభవించారు.
మిషన్ మజ్నులోని ‘రబ్బా’ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో రష్మిక మాట్లాడారు. ‘బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ బాగుంటాయి. చిన్నప్పటి నుంచి నా వరకైతే రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ సాంగ్సే. సౌత్‌లో మనకు మాస్ మసాలా, ఐటెమ్ సాంగ్స్, డాన్స్ సాంగ్స్ ఉన్నాయి. ఇది నా మొదటి బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్. చాలా బాగుంది. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నాను..’ అని అన్నారు.
కొందరు రష్మిక మందన వ్యాఖ్యలను సమర్థిస్తూ బాలీవుడ్‌లో ఎల్లప్పుడూ బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే సౌత్ సాంగ్స్ అంటే కేవలం మాస్ మసాలా, ఐటమ్ సాంగ్స్ అన్న అర్థంలో రష్మిక చేసిన వ్యాఖ్యలకు చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అందుకే కన్నడ ప్రజలు ఆమెను ద్వేషిస్తారు. ఆమె ఏదీ సరిగ్గా ఆలోచించకుండా మాట్లాడుతారు..’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘అభిమానులుగా మేమంతా మసాలా, ఐటమ్ సాంగ్స్‌ను చూసి గర్వపడుతున్నాం. అవి మూవీలో అడ్రినలిన్ పెంచుతాయి.. తెలుగులో మెలోడీ సాంగ్స్‌కు ఏవీ సాటి రావు.. ఆమె ఇలా దాడి చేయడం సిగ్గుచేటు..’ అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే కొందరు రష్మిక అభిప్రాయాన్ని ఏకీభవించారు. ‘బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్‌కు ప్రసిద్ధి. దక్షిణాది చిత్రాలు మాస్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్‌కు ప్రసిద్ధి. అది నిజం. ఆమె ఏ పరిశ్రమను నిందించలేదు. తక్కువ చేయలేదు..’ అని ఒకరు కామెంట్ చేశారు.