తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ..’ పేరుతో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కందుకూరులో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రాగా, ఆయన్ని చూసేందుకు టీడీపీ కార్యకర్తలు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు జనసమీకరణ జరిపారు. కొంప ముంచిన జన సమీకరణ..
వేలాది మంది జనం గుమికూడటంతో, కందుకూరు జనసంద్రంగా మారింది. అయితే, తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో స్థానిక పోలీసు యంత్రాంగం, అలాగే టీడీపీ శ్రేణులు విఫలమయ్యాయి. తొక్కిసలాట జరగడంతో కొందరు వ్యక్తులు అక్కడే వున్న కాలువలో పడిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో షాక్‌కి గురైన చంద్రబాబు , ప్రసంగాన్ని ప్రారంభించకుండానే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది. గాయపడ్డ మరో 8 మంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.