మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య అక్రమ అరెస్ట్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఎనిమిది పదుల వయసులో ఉన్న హరిరామజోగయ్య విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వానికి హరిరామజోగయ్య డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వంఅలెర్ట్ అయ్యింది. ఆదివారం అర్థరాత్రి పాలకొల్లులోని హరిరామజోగయ్య ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే సీఎం జగన్ కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన ప్రకటన చేసే వరకూ తన దీక్ష కొనసాగిస్తానని హరిరామజోగయ్య పట్టుబట్టారు. దీంతో అతడి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరోవైపు ఏలూరు ఆస్పత్రిలో ఉన్న హరిరామజోగయ్యకు పవన్ ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన పేరిట ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
హరిరామజోగయ్య అరెస్ట్ ఘటనతో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలు, ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హరిరామజోగయ్య వయసు 85 సంవత్సరాలు. ఆయన వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అతడి ఇంటిని ముట్టడించిన పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఆయన కూర్చున్న కుర్చీతో సహా తీసుకెళ్లి అంబులెన్స్ లో పడేశారు. ఎనిమిది పదుల వయసులో పోలీసులు కర్కశంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అటు కాపు సంఘం నేతలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పోలీసులు దూకుడును కనబరచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం విధ్వంసాలకు దారితీసిన నేపథ్యంలో.. మరోసారి అటువంటి వాటికి తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. 85 సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. తక్షణం ఆయనతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.