ఆంధ్ర వాళ్లకు వివరం తెలవదు. విజ్ఞానం తెలవదు.. వాళ్ళు వండే బిర్యానీ… పేడ బిర్యాని.. కర్రీ పాయింట్ పెట్టుకుని బతికే వాళ్లకు తెలంగాణలో ఏం పని’.. ఇవే కాదు ఇంతకంటే ఎక్కువ విమర్శలు కేసీఆర్ నోటి నుంచి వచ్చాయి. ఆ తర్వాత వాటిని ఉద్యమ సమయంలో వచ్చిన ఆవేశం తాలూకు మాటలని కేసీఆర్ సమర్థించుకున్నప్పటికీ .. ఆంధ్రా ప్రజలు వాటిని అంత సులువుగా మర్చిపోయే అవకాశం లేదు. ఏ నోటితో అయితే ఆంధ్రా ప్రాంతాన్ని తిట్టారో.. అదే ప్రాంతంలోకి కెసిఆర్ తన భారత రాష్ట్ర సమితి కోసం, వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు వెళ్లే అవకాశం ఉంది.. మరి ఇప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టే కెసిఆర్ గతంలో తాను విమర్శించినట్టు పేడ బిర్యాని తింటారా, కర్రీ పాయింట్ లో కర్రీ కొనుక్కొని వెళ్తారా అని ఆంధ్ర ప్రజలు విమర్శిస్తున్నారు. తమను తిట్టిన నోటితో ఎలా ఓట్లను అభ్యర్థిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. KCR విద్వేషాలు నూరి పోయడం సమంజసమేనా? తెలంగాణ ఉద్యమం అనేది కెసిఆర్ ప్రారంభిస్తేనే ప్రారంభం కాలేదు.. తొలి దశలో, మలి దశలో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కూడా రాజకీయ పోరాటాల ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని, ద్వేషంతో ఎన్నటికీ రాష్ట్రాన్ని సాధించలేమని ఆయన పలమార్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ప్రతిసారి ఆంధ్ర ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు.. ఒకానొక దశలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రెండు ప్రాంతాల మధ్య అంతరాన్ని పెంచింది..
దేశంలో ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగలేదు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కేవలం శాంతియుత విధానంలో మాత్రమే ఆ ప్రక్రియ పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల కారణంగా అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో చాలామంది నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుపుకున్నారు.. విద్వేషపూరిత ప్రసంగాల వల్ల చాలా అభివృద్ధి పథకాలు, కంపెనీలు హైదరాబాద్ రాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. ముఖ్యంగా చిదంబరం అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వివిధ రకాల పరిశ్రమలను తన సొంత రాష్ట్రం తమిళనాడుకు తరలించుకుపోయారు. ఇప్పుడు ఎలా వస్తారు నాడు ఆంధ్రా ప్రాంతాన్ని, ఆంధ్రా ప్రజలను నానా మాటలు అన్న కేసీఆర్… నేడు మా ప్రాంతానికి ఎలా వస్తారని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. నాడు కెసిఆర్ కనుక సమయోచితంగా వ్యవహరించి ఉంటే ఈనాడు ఇంతటి వైషమ్యాలు తెరపైకి వచ్చేవి కావని వారు అంటున్నారు.. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య అనేక పంచాయితీలు ఉన్నాయని, చాలా వరకు కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా ఆంధ్రాలో ఎలా అడుగు పెడతారని వారు ధ్వజమెత్తుతున్నారు.. నిజానికి జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వాటా దగ్గర మొదలైన వివాదం మరింత దూరం పెంచింది.. ఇక తెలంగాణలోని మధిర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం కనిపిస్తున్నది. క్షేత్ర స్థాయిలో ఇన్ని సమస్యలు కనిపిస్తున్నప్పుడు… వాటి పరిష్కారానికి చొరవ తీసుకోకుండా ఆంధ్రాలో కేసీఆర్ అడుగు పెట్టడమంటే… అది దింపుడు కల్లం ఆశేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.