కోవిడ్ తర్వాత… జనాల్లో మార్పు వచ్చింది. తిండికి, మిగతా వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో అదే ప్రతిబింబించింది. బీరు కోసం, బిర్యానీ కోసం డబ్బును మంచి నీళ్ళల్లా ఖర్చు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు 215.74 కోట్లు వచ్చాయి..శనివారం అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి..ముఖ్యంగా హైదరాబాద్ రెండు డిపోల్లో రూ. 37.68 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల్లో 2,17,444 కేసుల( కార్టన్ల) లిక్కర్ విక్రయం జరిగింది. ఇక బీర్ల విషయానికి వస్తే 1,28, 455 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, 2021 డిసెంబర్ 31న రూ. 171.93 కోట్ల మేర మద్యం అమ్ముడు పోయింది. మొత్తంగా 2022 లో రాష్ట్రంలో 34, 332 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. చివరి ఆరు రోజుల్లో రికార్డు స్థాయిలో రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. Liquor Sales ఏపీలో 142 కోట్లు.. న్యూ ఇయర్ వేడుకల్లో ఏపీ మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబరు 31 న ఒక్క రోజులోనే రూ. 142 కోట్ల మద్యం విక్రయించింది.
గతంలో ఏ సంవత్సరం లోనూ ఒక్క రోజులో ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. 2021 డిసెంబరు 31 న రూ. 112 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అప్పటికి అదే అత్యధికం. కానీ, ఈసారి అమ్మకాలు మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం సమయాన్ని ఏకంగా మూడు గంటలు పెంచింది. అర్ధరాత్రి 12 గంటల వరకు షాపులు తెరిచే ఉంచింది. ఆ ప్లాన్ విజయవంతమై గత ఏడాది కంటే 30 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి.. షాపుల్లో 127 కోట్లు, బార్లల్లో 15 కోట్ల మద్యం అమ్మారు.. మొత్తంగా 1.54 లక్షల కేసుల మద్యం, 72,000 కేసుల బీర్లు విక్రయించారు.. ప్రస్తుతం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.. శనివారం మాత్రం ఇంతకు రెట్టింపుగా విక్రయాలు జరిగాయి. హైదరాబాద్ బిర్యాని హవా డిసెంబర్ 31 నాడు బిర్యానీ హవాసాగింది.. దేశవ్యాప్తంగా 3.5 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్టు స్విగ్గి సంస్థ ప్రకటించింది.. శనివారం తాము డెలివరీ చేసిన ఆర్డర్లలో బిర్యాని అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నది.. ఇక ట్విట్టర్లో స్విగ్గి సంస్థ పెట్టిన పోల్ లో హైదరాబాద్ బిర్యానీ 76.2% ఓట్లు దక్కించుకుంది.. లక్నో బిర్యానీ 14%, కోల్కతా బిర్యాని 9.8% ఓట్లు దక్కించుకుంది.. ఇక హైదరాబాదులో అత్యధికంగా బావర్చి బిర్యాని కి ఆర్డర్లు వచ్చాయి.