వైసీపీ నేత, ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తొడకొట్టారు. సొంత జిల్లా శ్రీకాకుళంలోని బూర్జ మండలంలోని పాార్టీ మండల అధ్యక్షుడు కె గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు తమ్మినేని సీతారాం. ‘మళ్ళీ జగన్ కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడ కొట్టి చెప్పింది’ అంటూ ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తాను కూడా తొడకొట్టారు. మళ్ళీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని తమ్మినేని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారు..
ఒకప్పుడు నారావారిపల్లెలో రెండెకరాల భూమి మాత్రమే వున్న చంద్రబాబు ఇప్పుడెలా కోట్లకు పడగలెత్తాడంటూ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ‘ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం వుందా.? వుంటే, దాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తే నిరుపేద అంటూ ఎవరు వుండరు’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను పీకేస్తామంటున్నారనీ, వాలంటీర్లను వైకాపా ప్రభుత్వ ఉద్యోగుల కింద త్వరలో ప్రకటన చేయనుందని చెప్పారు తమ్మినేని సీతారాం. చంద్రబాబు గెలవడం కోసం నానా రకాల హామీలు ఇచ్చి, గెలిచాక మాట తప్పడం వల్లే ప్రజలు ఆయన్ని ఓడించారని తమ్మినేని చెప్పారు.