వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై. అవును.. చంద్రబాబు మరణాల అంకెలతో తనకు తాను పాపులారిటీ లెక్కలు వేసుకుంటున్నారంటూ ఆరోపించారు. కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను ఆయన ఉదాహరణగా తీసుకొని ఆర్జీవీ మాట్లాడారు. ఇలాంటి సందర్భాలు హిట్లర్ తర్వాతనే చంద్రబాబును చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అసలు పెద్ద గ్రౌండ్స్ లో సభలు పెడితే ఎవరు వస్తారు.. జనాలు ఎవరూ రారు. తనకు మద్దతు లేదని అనుకుంటారు.. అందుకే ప్రజలకు ఆశ పెట్టి జనం ప్రాణాలతో చెలగాటం ఆడారు.. అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారంటూ ఆర్జీవి మండిపడ్డారు.
బిస్కెట్ల ఎర వేసి ప్రజలను గుంటూరు సభకు రప్పించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఫోటోలకు పోజులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు జనం రద్దీగా ఉంటే ఏం చేయాలో తెలియదా? ఏం జరుగుతుందో తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రజల గురించి తెలియదా? ప్రజలకు బిస్కెట్ల ఎర వేసి జనాలను చంద్రబాబు రప్పించారు ఏం పరిస్థితులు ఉన్నాయో తెలియదా? సభలకు జనాలను రప్పించడం కోసం.. ఎరలు వేసి రప్పించుకుంటున్నారు. అసలు సభలకు వస్తే కానుకలు వస్తాయి అనే కాన్సెప్ట్ ను ప్రారంభించిందే చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు ఆర్జీవీ. జనాల మరణాలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తన పాపులారిటీకి కొలమానంగా భావిస్తున్నారు అంటూ ఆర్జీవీ ఫైర్ అయ్యారు. సందుల్లో సభలు పెట్టి, ఏవో ఇస్తామని జనాలను రప్పిస్తే ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఇంత అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు.