మన్యం న్యూస్, అశ్వరావుపేట, జనవరి 8: అశ్వరావుపేటలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నార్లపాటి సుబ్బారావు అధ్యక్షతన ఆదివారం జిల్లా, మండల స్థాయి ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షుడు నార్లపాటి సుబ్బారావు మాట్లాడుతూ జనవరి 11వ తారీకు బెంగళూరులో జరిగే ఎమ్మార్పీఎస్ బహిరంగ సభకు గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త తరలివచ్చి సభ జయప్రదం చేయవలసిందిగా కోరారు. అలాగే రాబోయే శీతాకాల అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఎమ్మార్పీఎస్ డిమాండ్ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసే విధంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేనియెడల గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కోలేటి పకీరయ్య, జిల్లా నాయకులు కాంతారావు, నార్లపాటి సత్యం, గౌరవ సలహాదారుడు గాలంకి అశోక్, మధు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.