సారు మాకు జీతాలు ఇప్పించరూ…
– మనోవేదన చెందుతున్న వంద పడకల ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు.
– చర్యలు తీసుకోకపోతే ధర్నా చేస్తాం.
-ఐయన్ టియుసి ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్.
మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 09: అయ్యా సారు మాకు జీతాలు ఇప్పించరూ అంటూ మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు మనోవేదన చెందుతున్నారు. రెండు మూడు సంవత్సరాలు అయినా జీతాలు అందక నాన అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా గానీ మా బాధలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు లేక వడ్డీకి అప్పులు తీసుకుని డ్యూటీలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ పడరాని బాధలు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్ సోమవారం వంద పడకల ఆస్పత్రిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఎంతో కష్టం చేస్తున్న కార్మికులకు అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. జీతాలు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐఎన్ టీ యూసీ అండగా ఉంటుందన్నారు. సంక్రాంతి పండుగ లోపు జీతాలు చెల్లించకపోతే ఐఎన్ టీ యూసీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ రోజు వంద పడకల ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి సెక్రటరీ భద్రం, జాయింట్ సెక్రటరీ నారాయణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.