మన్యం న్యూస్, వాజేడు: రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది.కలిసి బతుకుతానని భర్త వేలు పట్టుకొని ఏడడుగులు నడిచిన భార్య మానవత్వం మరిచి ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని కడతేర్చిన సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పేరూరు ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన గోడ్డే బసవయ్య( బాబు) (47 సం.) అతడి భార్య అయిన గొడ్డే సుజాత అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో గత కొంత కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది.ఈ విషయమై గతంలో పంచాయతీ జరిగినా కూడా వారిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు, గత రాత్రి సోమవారం అర్ధరాత్రి సమయంలో దర్శన్ బాబు, సుజాత రచించుకున్న పథకం ప్రకారం సుజాత భర్త బసవయ్య ( బాబు) వారిద్దరి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతడిని ఇద్దరు కలిసి గొంతు నులిమి చంపేశారు.గోట లాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేరూరు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.