మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 25: అసంఘటితరంగా కార్మికులను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి అన్నారు. ఆయన బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓబి, ఎక్స్ ప్లోజివ్, బొగ్గు ముఠా గుమస్తాలు, గ్లోబల్ కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. పవర్ ప్లాంట్ బొగ్గు సప్లై కాంట్రాక్టర్లు కార్మికుల యెడల ఉక్కు పాదం మోపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరైనా అడిగితే కొంతమంది వ్యక్తులు పార్టీల పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి కాంట్రాక్టర్లు తప్పించుకుంటున్నారన్నారు. ఎక్స్ ప్లోజివ్, కార్మికులు 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని వారికి అగ్రిమెంట్ చేయకుండా జీతాలు పెంచకుండా బెదిరించి పని చేయిస్తున్నారన్నారు. పనిచేయకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేయాలని, వారి హక్కుల సాధనలో సిపిఐ పార్టీ అగ్రభాగాన ఉంటుందన్నారు. ఇప్పటికైనా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మున్నా లక్ష్మీకుమారి, అక్కి నరసింహారావు, సర్వర్ లు పాల్గొన్నారు.
