ఆరోగ్యమే మహాభాగ్యం… జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
పోలీస్ అధికారులు,సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
మెగా వైద్య శిబిరంలో.. జిల్లా ఎస్పీ
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16.. ఆరోగ్యమే మహాభాగ్యమని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలను చక్కదిద్దుకోగలుగుతామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురం లోని పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద పోలీసులకు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులలో నిమగ్నమై ఉంటున్న పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వారికోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లా పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గుండె,ఊపిరితిత్తులు,ఎముకలు,న్యూరాలజీ,కంటి చికిత్సలు ఇతర ఆరోగ్య సంబంధిత చికిత్సల కొరకు నిపుణులైన వైద్యులను పిలిపించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.ఇచ్చట వైద్య పరీక్షలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారిని పోలీసు శాఖ తరపున మెరుగైన చికిత్స చేయించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందానికి,పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న పోలీస్ అతిధి గృహం నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరలోనే అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ డిఎస్పీ విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి ,సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు సిబ్బంది పాల్గోన్నారు.
