టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేతలను ఎలాగైనా ఇరికించి లబ్ధి పొందాలని చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇందుకోసం రోజుకో వ్యూహం రచిస్తున్నారు. సిట్ ద్వారా వాటిని అమలు చేయిస్తున్నారు. ఈ కేసులో ఇటు సిట్ నోటీసులు.. అటు కోర్టు తీర్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీజేపీకి.. తాజాగా కేసీర్ భారీ షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్‌తోపాటు ముగ్గురిపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు.
కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిపై మరోమారు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబందించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్‌కు సిట్ ఈనెల 16న నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే ఆ నోటీసులు ఆయనకు అందాయో లేదో సమాచారం తెలియరాలేదు. ఈనెల 21న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ బీఎల్.సంతోష్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. దీనితో నోటీసులు అందాయో లేదో అన్న అనుమానం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
”సంతోష్‌కు నోటీసులు ఇచ్చినా ఎందుకు రావడం లేదు. గడువు కావాలని కోరుతున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా” అని ప్రశ్నించింది. అయితే సంతోష్ ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో విచారణకు హాజరు కాలేదని తెలుస్తుంది. అయితే మళ్లీ సంతోష్‌కు నోటీసులు ఇవ్వాలని, వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించాలని సిట్‌కు కోర్టు సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ సిట్ అధికారులు సంతోష్‌తోపాటు కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌కు కూడా సిట్ తాజాగా నోటీసులు ఇచ్చారు. అదే సమమయంలో ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధం ఉన్నట్లు సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్‌పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై హైకోర్టులో ఈనెల 30న మళ్లీ విచారణ జరుగనుంది. ఈ క్రమంలో సిట్ కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.