వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ను పోలీసులు నర్సంపేటలో అరెస్ట్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం నర్సంపేటలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైటీపీ – టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. వాహనాల ధ్వంసం.. నర్సంపేటలో అనూహ్యంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
షర్మిల అనుచరులకీ, టీఆర్ఎస్ మద్దతుదారులకీ మధ్య ఘర్షణ నేపథ్యంలో పలువురికి గాయలయ్యాయి. కాగా, పాదయాత్రలో టీఆర్ఎస్ గూండాలు బస్సుని తగలబెట్టారనీ, తమ పార్టీ నాయకుల్ని కొట్టారనీ, పోలీసులు ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో తనను అరెస్టు చేశారని షర్మిల ఆరోపించారు. ఇదిలా వుంటే, తన తండ్రిని కుట్ర చేసి చంపారని గతంలో ఆరోపించిన షర్మిల, తనను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే.