విలక్షణ నటనతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు హీరో ధనుష్. తెలుగులో అతడి సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంది. రఘువరన్ బీటెక్‌తో పాటు ధనుష్ నటించిన పలు అనువాద సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాయి. గత కొంతకాలంగా తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాడు ధనుష్. తాజాగా సోమవారం దర్శకుడు శేఖర్ కమ్ములతో కొత్త సినిమాను మొదలుపెట్టాడు ధనుష్. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో ధనుష్‌తో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
శేఖర్ కమ్ముల గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పేరున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. నాగచైతన్యతో రూపొందించిన లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో ధనుష్‌తో సినిమా చేయబోతున్నట్లు శేఖర్ కమ్ముల వెల్లడించాడు. ఈ సినిమాను అనౌన్స్‌చేసి చాలా కాలమైన ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ధనుష్‌తో సార్ సినిమా చేస్తున్నాడు. విద్యావ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.