ఇప్పుడు మనం తెలుసుకోబేయే రెసిపీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రేవీ కర్రీని ఏ కర్రీ కోసం అయినా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు.
అంటే మీరు చికెన్ గ్రేవీ కర్రీ చేయాలంటే.. మష్రూమ్స్‌ని చికెన్‌తో రిప్లేస్ చేసుకోవచ్చు. అన్నింటికి ఒకటే సొల్యూషన్ అన్నట్లు.. మీరు ఈ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* పుట్టగొడుగులు – 200 గ్రాములు
* క్యాప్సికమ్ – 1 కప్పు
* ఉల్లిపాయలు – ¾ కప్పు (తరిగినవి)
* టమోటాలు – ¾ కప్పు (తరిగినవి)
* కరివేపాకు – 1 రెమ్మ
* పచ్చిమిర్చి – 1
* జీలకర్ర – ½ టీస్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
* కారం – ¾ టీస్పూన్
* గరం మసాలా – ¾ టీస్పూన్
* కసూరి మేతి – 1 టీస్పూన్ (ఆప్షనల్)
* నూనె – 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు – రుచికి తగినంత
* పసుపు – చిటికెడు
రోస్ట్ చేయడానికి
* వేరుశెనగ – 2 టేబుల్ స్పూన్లు
* నువ్వులు – 1 టేబుల్ స్పూన్
* ఎండిన కొబ్బరి – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
మీడియం మంట మీద.. వేరుశెనగలను వేయించాలి. అనంతరం మంట తగ్గించి నువ్వులు వేసి ఫ్రై చేయాలి. స్టవ్ ఆపేసి కొబ్బరిని వేయాలి. వీటన్నింటినీ చల్లార్చి పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని వేడి చేయాలి. దానిలో నూనె వేసి.. శుభ్రం చేసి.. కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసి వేయించాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసి.. వీటిని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో బెల్ పెప్పర్స్/క్యాప్సికమ్‌ను వేసి వాటిని పాక్షికంగా ఉడికించుకోవాలి. అనంతరం వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసి.. జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి.. లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దానిలో టమోటాలు.. ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.టమోటాలలోని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ, నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని దీనిలో వేయాలి. తగినంత నీరు పోసి.. బాగా కలపాలి. కూర చిక్కగా మారేవరకు అలాగే ఉడకనివ్వాలి. అనంతరం పుట్టగొడుగులు, బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. పిండిచేసిన కసూరి మేథీ, గరం మసాలా వేసి బాగా కలపాలి. పాన్‌ను ఆపివేసి మూత పెట్టేయండి. అంతే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ.
ఇది కాస్త చల్లారిన తర్వాత దానిలో నిమ్మరసం వేయాలి. కొత్తిమీరతో గార్నీష్ చేయవచ్చు. రోటీ, పరాటా, అన్నం, జీరా రైస్‌తో మష్రూమ్ కర్రీని హ్యాపీగా లాగించేయవచ్చు.