శ్రీరామనవమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దు. కళ్యాణ వేడుకల్లో సకల సౌకర్యాలను కల్పించండి
శ్రీరామ నవమి మహోత్సవ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21… పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో నిర్వహించే శ్రీరామనమే వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళ్యాణ వేడుకల్లో సకల సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.ప్రతి భక్తుడు స్వామి వారి కళ్యాణ వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఐడిఓసి కార్యాలయంలో శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత సంవత్సరం భక్తుల మన్ననలు పొందే విధంగా ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ సంవత్సరం అదే స్పూర్తితో దిగ్విజయంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేద్దామని తెలిపారు. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి, 31వ తేదీన
పుష్కర పట్టాభిషేకం మహోత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. స్వామివారి వేడుకలు నిర్వహించనున్న మిథిలా స్టేడియంలో సెక్టారు ప్రణాళిక తయారు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించాలని,
ప్రతి సెక్టారు పర్యవేక్షణకు జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. వేడుకలు నిర్వహణకు కార్యాచరణ తయారు చేయడంతో పాటు పర్యవేక్షణ అత్యంత ముఖ్యమని సూచించారు కార్యాచరణ అమలు పర్యవేక్షణ ద్వారా వేడుకలు నిర్వహణకు సిద్ధం కావాలన్నారు.. కేటాయించిన విధులు ప్రకారం అధికారులు కసరత్తు
ప్రారంభించాలని , ముందు నుండే సన్నద్ధం కావడం వల్ల ఎలాంటి లోటుపాట్లుకు తావులేకుండా వేడుకలు
ఘనంగా నిర్వహించగలమని అన్నారు. మార్చి 25వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.మార్చి 1వ తేదీ నుంచి భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని
సూచించారు. పోస్టల్, మీ సేవా, కార్గో సర్వీసులు ద్వారా భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలు చేరవేయు విధంగా చర్యలు చేపట్టాలన్నారు.. తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీ కేంద్రాలు వద్ద రద్దీ నియంత్రణకు బారికేడింగ్ ఏర్పాటు
చేయాలని చెప్పారు. భక్తులకు సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్జేకు సూచించారు. విధులు నిర్వహించు సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని సెక్టార్లులో ఎల్ఈడి టివిలు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులు ఒక సెక్టారు నుంచిమరొక సెక్టారుకు వెళ్లకుండా బారికేడింగ్
ఏర్పాటు చేయాలని ,మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఉన్నారు .భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, బస్సుల్లో భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ
చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక పారిశుద్య సిబ్బందిని
ఏర్పాటు చేయాలని డిపిఓకు సూచించారు. వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగించేందుకు జోన్లుగా విభజించి పర్యవేక్షణకు ప్రతి జోన్ కు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని తెలిపారు. అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని .
పట్టణంలోని ప్రధాన కూడళ్లులో మంచినీటి సౌకర్యం కల్పించాలని , భక్తులు ఎండ నుంచి ఉపశమనం
పొందేందుకు మజ్జిగ, మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. స్వామి వారి ప్రసాదాలు, హెూటళ్లులోని ఆహార పదార్థాలను నాణ్యతలను తనిఖీ చేయాలని ఆహార తనిఖీ అధికారులను ఆదేశించారు. తినుబండాలను అధిక ధరలకు
విక్రయించకుండా హెూటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలను నిర్ణయించాలని భద్రాచలం, ఆర్డీఓకు సూచించారు. వాహనాలు పార్కింగ్కు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు గుర్తించడానికి అనువుగా
సైనోబోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన రహదారుల వెంబడి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిఆర్డిఓకు సూచించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు గజ
ఈతగాళ్లను, నాటు పడవలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పుణ్య కార్యక్రమని భక్తులు ప్రమాదాలకు గురికావొద్దని గోదావరి లోతును తెలియచేయు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పటిష్ట పర్యవేక్షణ ఉండాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. 24 గంటలు పనిచేయు విధంగా అత్యవసర వైద్య కేంద్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. భక్తులు ఎండ తాకిడికి గురికాకుండా అడుగడుగున వైరస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. శ్రీరాముని వేడుకల్లో విద్యుత్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. పుణ్యక్షేత్రం ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకల రోజున మద్యం మాంసం విక్రయాలను నిషేదించాలని, సమీప లాడ్జిలలో అధిక ధరలు నిర్ణయించకుండా సంబంధిత వారికి సూచించాలని తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి, డిపిఓ రమాకాంత్, డి ఆర్ డి ఓ మధుసూదన రాజు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆర్టీవో వేణు, ఆహారపు తనిఖీ అధికారి వేణుగోపాల్, రోడ్డు భవనాల శాఖ ఈఈ భీమ్లా, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ స్వర్ణలత, దేవస్థానం ప్రధాన అర్చకులు కురిచేటి సీతారామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.